ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ, అలీగంజ్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న పలువురు విద్యార్థులు లోపలే చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు విద్యార్థులు భవనం పైఅంతస్తుల నుంచి కిందికి దూకారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి అందరినీ తీవ్రంగా కలచివేస్తున్నాయి. స్థానిక అధికారుల కథనం ప్రకారం అలీగంజ్‌లోని ఓ మూడంతస్తుల భవనం కింది భాగంలో తొలుత మంటలు చెలరేగాయి. అయితే, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ మంటలు క్షణాల్లోనే పైఅంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్‌కు ఎగబాకాయి. క్షణాల వ్యవధిలోనే భవనమంతా అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకోవడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణభయంతో భవనం కిటికీల గుండా, పైఅంతస్తుల నుండి కిందికి దూకి తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్ లోపల ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంకా ఎవరైనా లోపల చిక్కుకుపోయారా అనే దానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments