నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణ లోపాలు, సాంకేతిక తప్పిదాలు దేశవ్యాప్తంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను రోజురోజుకూ తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ, ఫలితాల వివాదాలతో అట్టుడుకుతున్న తరుణంలో.. ఎన్‌టీఏ తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక 18 ఏళ్ల విద్యార్థికి ఏకంగా ఊహించని షాక్ ఇచ్చింది. జూన్ 21న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులకు జరగబోయే నీట్ రీ-ఎగ్జామ్ కోసం హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న సదరు అభ్యర్థికి.. ఏకంగా 2,500 కిలోమీటర్ల దూరంలో, విదేశాల్లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించి ఎన్‌టీఏ తన నిర్లక్ష్యాన్ని మరోసారి నిరూపించుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా మహమ్మద్ తాలిబ్ (18) అనే నీట్ అభ్యర్థి ఈ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అబ్దుల్లా తన అప్లికేషన్ ఫారమ్‌లో పరీక్షా కేంద్రాల కోసం మొదటి ప్రాధాన్యతగా నాగ్‌పూర్, ఆ తర్వాత వార్ధా, భండారా జిల్లాలను మాత్రమే ఆప్షన్లుగా ఎంచుకున్నాడు. అసలు విదేశీ ఆప్షన్ ఇవ్వకపోయినప్పటికీ, ఎన్‌టీఏ అతడికి ఏకంగా యూఏఈ రాజధానిలోని ‘అబుదాబి ఇండియన్ స్కూల్’ను ఎగ్జామ్ సెంటర్‌గా కేటాయించింది. “సాధారణంగా ఎన్‌ఆర్‌ఐ విద్యార్థుల కోసం విదేశాల్లో సెంటర్లు ఇస్తారు. కానీ మా అబ్బాయికి అసలు పాస్‌పోర్ట్ కూడా లేదు. విదేశీ ఆప్షన్ పెట్టకుండానే అబుదాబి సెంటర్ ఇస్తే, ఇంత తక్కువ సమయంలో అంత దూరం ప్రయాణ ఏర్పాట్లు ఎలా చేసుకోగలం? ఎన్‌టీఏ నిర్వాకం వల్ల మా కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.” ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల రద్దు, రీ-టెస్ట్ గందరగోళంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో హాల్‌టికెట్లలో ఇలాంటి బ్లండర్స్ రావడంతో అబ్దుల్లా తీవ్ర మనస్తాపానికి గురై, అసలు పరీక్షే రాయనంటూ కన్నీరు పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో మళ్లీ చదువుపై దృష్టి పెట్టాడు. బాధిత కుటుంబం వెంటనే ఎన్‌టీఏ హెల్ప్‌లైన్‌ను సంప్రదించగా డేటాబేస్ అప్‌డేట్‌లో జరిగిన సాంకేతిక లోపం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని అధికారులు అంగీకరించారు. విద్యార్థి దరఖాస్తును రీ-వెరిఫై చేసి, జూన్ 20 సాయంత్రంలోగా నాగ్‌పూర్‌లోనే కొత్త హాల్‌టికెట్ మరియు పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని బోర్డు అధికారులు హామీ ఇచ్చారు. కేవలం అబ్దుల్లా మాత్రమే కాకుండా, నాగ్‌పూర్ పరిధిలోని మరెంతో మంది విద్యార్థులకు కూడా ఎన్‌టీఏ సుదూర ప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో సెంటర్లను మార్చిందని స్థానిక లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. పాత సెంటర్లనే కొనసాగించాలా? అని ఎన్‌టీఏ మొబైల్‌కు పంపిన మెసేజ్‌కు ‘పాత సెంటర్లే’ అని రిప్లై ఇచ్చినప్పటికీ.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సరికి సెంటర్లు మారిపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఎన్‌టీఏ ఐటీ సిస్టమ్స్ మరియు డేటాబేస్ లోపాలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు.
0 Comments