రష్యా రాజధాని మాస్కో, పరిసర ప్రాంతాల్లో ఉక్రెయిన్ వందలాది డ్రోన్లతో భీకర దాడులు జరపడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల రోజుల నుంచి ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. ప్రధానంగా చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇదే క్రమంలో గురువారం రష్యా రాజధాని మాస్కోపై అతి పెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది. క్రెమ్లిన్‌కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్కో చమురు శుద్ధి కర్మాగారంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్న దృశ్యాలపై రష్యా మీడియా విడుదల చేసిన చిత్రాలు, వీడియోలు వైరల్‌గామారాయి. గత నాలుగన్నరేళ్లలో ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. రష్యా రాజధాని చుట్టూ ఉన్న లక్ష్యాలపై దాదాపు 200 డ్రోన్లు దాడి చేయడంతో, దట్టమైన నట్టి పొగ మేఘాలు వ్యాపించాయి. ఆగ్నేయ మాస్కోలోని కపోట్న్యా రిఫైనరీపై నెలలో మూడవసారి, ఈ వారంలో రెండవసారి. ఈ దాడితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, పొగతో ఆకాశం నల్లగా మారిపోయింది. ఒక పేలుడు ధాటికి పెద్ద చమురు నిల్వ ట్యాంక్ మూత డజన్ల కొద్దీ మీటర్ల ఎత్తుకు ఎగిరి పడింది. డ్రోన్ శకలాలు భవనంపై పడటంతో సమీపంలోని ఒక షాపింగ్ సెంటర్ కూడా తగలబడినట్టు సమాచారం. అనేక నివాస బహుళ అంతస్తుల భవనాలను ఖాళీ చేయించారు.
0 Comments