ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ లోసింగి రెవెన్యూ గ్రామంలో కొత్తలో సింగి, పాతలో సింగి, పెదగరువు, పిత్రి గడ్డ గ్రామాల్లో కొండ శిఖర గ్రామంలో కొండు ఆదివాసి గిరిజనులు సుమారు 312 జనాభా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ గ్రామాల్లో ఒకటో తరగతి నుండి 5 తరగతి వరకు సుమారు 60 మంది పిల్లలు ఉన్నారు. ఈ గ్రామాల నుండి వైబీ పట్నం స్కూల్ కి వెళ్లాలంటే 3 కిలోమీటర్లు, అంగనవాడి సెంటర్ కి వెళ్లాలంటే 13 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం జూన్ 6న డీఈవో రోలుగుంట ఎంపీడీవో,ఎమ్మార్వో బృందం వచ్చి స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రత్యామ్నాయ స్కూల్ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యామ్నాయ స్కూల్ తో పాటు పర్మినెంట్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు ఆధ్వర్యంలో యోగా ఆంధ్ర కార్యక్రమం ద్వారా వినూత్న పద్ధతిలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.