అమరావతి రాజధానిలోని సచివాలయం, అసెంబ్లీ, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. వీరికి గతంలో ఇచ్చిన ఓ వెసులుబాటును కొనసాగిస్తూ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా ఈ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం కొనసాగుతోంది. ఇప్పుడు దాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 2016లో అమరావతి రాజధాని ప్రకటన తర్వాత ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్లో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేందుకు ఉద్యోగులు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ విధానం అమల్లోకి తెచ్చి వెసులుబాటు కల్పించారు. దీంతో హైదరాబాద్ లో పిల్లలు, కుటుంబాలు కలిగిన ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే పని చేసి తిరిగి వెళ్లిపోయేవారు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని నిర్మాణం ముందుకెళ్లకపోయినా ఉద్యోగులకు ఈ ఐదు రోజుల పని విధానం మాత్రం కొనసాగించారు. అలా ఐదేళ్ల పాటు ఉద్యోగులు హైదరాబాద్ నుంచి సోమవారం రావడం, శుక్రవారం వరకూ పనిచేసి వెళ్లిపోవడం కొనసాగించేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారికి ఈ ఐదు రోజుల పని విధానం అలా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా తాజాగా మరో ఏడాది పాటు పొడిగింపు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు సచివాలయం, శాఖాధిపతుల కార్యలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు వర్తింపచేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు పని వేళలు కూడా కొనసాగుతాయి.
0 Comments