ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జొన్నగిరి బంగారం గనుల ప్రాజెక్ట్ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆయన పేర్కొన్నారు. వందల ఏళ్ల క్రితం పేరుగాంచిన ఈ ప్రాంతం మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అందరూ స్వర్ణగిరి అని పిలిచేవారని సీఎం గుర్తు చేశారు. ఎంతో కాలం క్రితం ఈ నేల బంగారం, రత్నాలకు నిలయంగా ఉండేదని ఆయన వివరించారు. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయి వైభవం రావడానికి ఈ మైనింగ్ ప్రాజెక్ట్ పునాది వేస్తుందని చెప్పారు. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుందని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా కేజీఎఫ్‌ ఎలాగైతే గోల్డ్ మైనింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందో, ఇప్పుడు జొన్నగిరి స్వర్ణగిరి గోల్డ్‌ఫీల్డ్‌గా పేరు తెచ్చుకుంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా మరిన్ని ఫలితాలు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతతో బంగారం వెలికితీత చేపట్టడం వల్ల నాణ్యమైన ఉత్పత్తి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.