పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్లమెంట్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ను రాజీనామా చేయాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన రాజీనామా చేస్తే ఆ స్ధానానికి వచ్చే ఉపఎన్నికలో పోటీ చేసి ఎంపీ కావాలని మమత భావిస్తున్నారు. అయితే ఇందుకోసం పఠాన్ తో లాబీయింగ్ చేసేలా బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కోరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై గంగూలీ ఇవాళ స్పందించారు. మమతా బెనర్జీ తరపున తాను యూసుఫ్ పఠాన్‌ను సంప్రదించానని, రాబోయే ఉప ఎన్నికలలో ఆమె పోటీ చేసేందుకు వీలుగా, ఆ నియోజకవర్గానికి ఎన్నికైన ప్రతినిధిగా ఉన్న తన రాజ్యాంగబద్ధమైన పదవికి రాజీనామా చేయాలని ఆమె సందేశాన్ని అందించానని ఆరోపణలు వచ్చాయని గంగూలీ తెలిపారు. ఈ ఆరోపణలు అవాస్తవం అన్నారు. వదంతులు, ఊహాగానాలకు బలికావద్దని తాను మీడియాను కోరుతున్నట్లు గంగూలీ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఇవన్నీ ఊహాగానాలేనని తేలిపోయింది.
0 Comments