Ad Code

పోలవరం ముంపు సమస్యను పరిష్కరిస్తాం : హరీష్‌రావు లేఖకు పీపీఏ జవాబు

పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు కలిగే ముంపు సమస్యను అత్యంత ప్రధానమైనదిగా గుర్తించి తప్పకుండా పరిష్కరిస్తామని బీఆర్ఎస్ నేత టి.హరీష్‌రావుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) హామీ ఇచ్చింది. 2025 ఏప్రిల్ 8న తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈ లేఖలో పీపీఏ గుర్తు చేసింది. పోలవరం గరిష్ఠ నీటిమట్టం (45.72 మీటర్లు) వల్ల తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రతీ ప్రాంతాన్ని పటిష్ఠమైన ఇంజనీరింగ్ పద్ధతుల్లో రక్షిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ అలా రక్షించడం సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం ఆ భూమిని సేకరించి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చింది. పోలవరం ముంపు వల్ల తెలంగాణ గ్రామాలకు పొంచి ఉన్న ముప్పుపై తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసిన విషయం విదితమే. గోదావరి పరివాహక ప్రాంతంలోని తెలంగాణ ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, వ్యవసాయ భూములను కాపాడేందుకు హరీష్‌రావు తీసుకున్న చొరవను పీపీఏ అభినందించింది. ప్రాజెక్టును త్వరగా వాడుకలోకి తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం మేరకు ప్రస్తుతం మొదటి దశలో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తున్నామని పీపీఏ వివరించింది. తెలంగాణలోని ఎగువ ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు అన్ని రకాల శాస్త్రీయ అంచనాలు, వరద నివారణ చర్యలు తప్పకుండా తీసుకుంటామని పీపీఏ మెంబర్ సెక్రటరీ ఎం.రఘురామ్ ఈ లేఖలో స్పష్టం చేశారు. పీపీఏ లేఖపై హరీశ్ రావు స్పందిస్తూ పోలవరం ముంపుపై తెలంగాణ మొదటి నుంచీ పడుతున్న ఆందోళన నిజమేనని ఈ లేఖతో తేలిపోయిందన్నారు. కేంద్రం రాతపూర్వకంగా ఇచ్చిన ఈ హామీలను మాటలకే పరిమితం చేయకుండా అమలు చేయాలని కోరారు. పోలవరం వల్ల తెలంగాణలోని ఏ ఒక్క ఊరికి, రైతుకు, కుటుంబానికి నష్టం జరగకుండా కేంద్రం, ఏపీ ప్రభుత్వం, పీపీఏ తగిన వరద నివారణ, పునరావాస చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu