ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై, వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి డోలా మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో రోజుకో నాయకుడి పేరు బయటకు వస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుందని ఆరోపించారు. మద్యం అమ్మకాల ద్వారా మాత్రమే కాకుండా, రవాణా, సరఫరా, డిపో వ్యవస్థల ద్వారా కూడా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. మంత్రి వివరాల ప్రకారం, మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా చేసే రవాణా ఛార్జీలను రూ.13 నుంచి రూ.35 వరకు పెంచి దాదాపు రూ.400 కోట్ల మేర అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. అలాగే అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న అధికారుల ద్వారా వ్యవస్థీకృతంగా భారీ మొత్తంలో అవినీతి జరిగిందని, మొత్తం రూ.3500 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో ఇప్పటికే పలు పేర్లు బయటకు వస్తున్నాయని, విచారణలు ముందుకు సాగుతున్న కొద్దీ అసలు లబ్ధిదారులు ఎవరో ప్రజలకు పూర్తిగా అర్థమవుతుందని అన్నారు. జగన్ మాజీ పీఏ కేఎన్‌ఆర్ పేరుతో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తూ, చివరకు ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో అందరికీ స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు. మద్యం నాణ్యత అంశాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో విక్రయించిన కొన్ని బ్రాండ్లలో హానికర రసాయనాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
0 Comments