వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా భారతీయ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా నియమితులయ్యారు. ఒక భారతీయుడు ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌కు గ్లోబల్ హెడ్‌గా ఎంపిక కావడం అంతర్జాతీయ టెక్ రంగంలో సరికొత్త సంచలనంగా మారింది. మార్క్ జుకర్‌బర్గ్ తన అధికారిక ప్రకటనలో కునాల్ షా సామర్థ్యాలపై పూర్తి ప్రశంసలు గుప్పించారు. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, కీలకమైన సాంకేతిక సంస్థలలో ఒకటిగా క్రెడ్ ను కునాల్ షా నిర్మించారు. ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌ను సున్నా నుండి వందకు తీసుకెళ్లగల బిల్డర్ మెంటాలిటీ , అంతర్జాతీయ స్థాయి దృక్పథం ఆయనకు సొంతం. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌ను సమర్థవంతంగా నడపడానికి ఆయనకున్న ఈ ప్రత్యేక శైలి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది అని జుకర్‌బర్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బిలియన్ల కొద్దీ వినియోగదారులతో పాటు మిలియన్ల కొద్దీ వ్యాపారాలకు వాట్సాప్‌ను మరింత మెరుగైన సేవగా తీర్చిదిద్దేందుకు కునాల్ షాతో కలిసి పనిచేయడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడేళ్లుగా వాట్సాప్‌ను 3 బిలియన్లకు పైగా వినియోగదారుల చెంతకు చేర్చడంలో, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి గోప్యతా ప్రమాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన విల్ క్యాత్‌కార్ట్ సేవలను జుకర్‌బర్గ్ కొనియాడారు. మెటాలో అత్యంత సమర్థుడైన నాయకుడిగా నిలిచిన విల్.. కంపెనీలోనే ఒక సరికొత్త విభాగానికి బదిలీ అయ్యారు. అక్కడ ఆయన మెటా సంస్థ కోసం సరికొత్త ఉత్పత్తులను మొదటి నుండి అభివృద్ధి చేసే బాధ్యతలను చేపట్టనున్నారు. భారతదేశంలో వాట్సాప్‌కు ఉన్న అతిపెద్ద మార్కెట్ వాట్సాప్ పే , బిజినెస్ చాట్స్ వంటి తాజా ఫీచర్ల నేపథ్యంలో.. ఒక ఇండియన్ టెక్ దిగ్గజానికి ఈ పగ్గాలు అప్పగించడం వెనుక మెటా పెద్ద వ్యూహమే పన్నిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంలో క్రెడ్ ద్వారా వినూత్నమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సృష్టించిన కునాల్ షా.. ఇప్పుడు గ్లోబల్ వేదికపై వాట్సాప్ తదుపరి తరం ప్రయాణాన్ని ఎలా నడిపిస్తారో, వాట్సాప్ బిజినెస్ రంగాన్ని ఏ విధంగా మరింత లాభదాయకంగా మారుస్తారో చూడాలని ప్రపంచ టెక్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
0 Comments