ఆంధ్రప్రదేశ్ లోని పుత్తూరు సీపీఐ డివిజన్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. చంద్రశేఖర్ రెడ్డి, పుత్తూరు డివిజన్ కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ పుత్తూరు మండలంలోని నందిమంగళం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 6/2 సబ్ డివిజన్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. అదే భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయని పేర్కొన్న వారు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను రక్షించాలని కోరారు. ఆ భూమిని గుర్తించి ఇల్లు స్థలం లేని పేదలకు ఇంటి స్థలాలుగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పుత్తూరు మండలంలో ఇంటి స్థలాల కోసం భూములను సమీకరించి అవసరమైతే భూ పోరాటం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు భూ అక్రమాలకు గురవుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని భూ ఆక్రమణలను అరికట్టి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. లేనిపక్షంలో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుడతామని, ఇంటి స్థలం లేని నిరుపేదల హక్కుల కోసం సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చంద్రబాబు, గోపి, రవి కృష్ణారెడ్డి, దిలీప్, రమణ తదితరులు పాల్గొన్నారు.
0 Comments