Ad Code

సముద్ర స్నానానికి వెళ్లి రాకాసి అలల ధాటికి కొట్టుకుపోయిన ఐదుగురు పర్యాటకులు

హారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గణపతిపూలే తీరంలో శనివారం సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు పర్యాటకులు రాకాసి అలల ధాటికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. వారాంతపు సెలవులను ఆనందంగా గడుపుదామని వచ్చిన పర్యాటకులు ఇలా సముద్ర గర్భంలో కలిసిపోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులంతా మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ (పూర్వపు ఔరంగాబాద్) జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. వీకెండ్ సెలవులు కావడంతో వీరంతా కలిసి గణపతిపూలే బీచ్‌ను సందర్శించడానికి వచ్చారు. శనివారం సరదాగా సముద్రంలో ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే ఆ సమయంలో సముద్రంలో అలల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాకాసి అలల వేగాన్ని, వాతావరణ పరిస్థితులను వారు ముందే అంచనా వేయలేకపోవడంతో, భారీ అలలు వారిని లోపలికి లాగేసుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది స్పందించి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ ఐదుగురు నీట మునిగి శ్వాస ఆడక మృతి చెందారు. వాతావరణాన్ని, అలల తీవ్రతను అంచనా వేయలేకపోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని రత్నగిరి జిల్లా సమాచార అధికారి మీడియాకు వెల్లడించారు. సమాచారం అందుకున్న రత్నగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం వాటిని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu