ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి, వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే స్థానికంగానే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని, ఇది స్థానిక యువత భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
0 Comments