పశ్చిమ ఆసియాలో ఒక్కసారిగా పెరిగిన యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత కరెన్సీపై పడింది. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 15 పైసలు తగ్గి 95.56 వద్దకు పడిపోయింది. గల్ఫ్ రీజియన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తడం రూపాయి పతనానికి దారితీశాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి కాస్త పుంజుకుని 95.41 వద్ద ముగిసింది. కానీ, బుధవారం ఉదయం ఫారెక్స్ మార్కెట్ ప్రారంభం కావడమే 95.52 వద్ద బలహీనంగా ప్రారంభమై, ఆ తర్వాత మరింత క్షీణించి 95.56 వద్దకు చేరింది. హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించడం, దానికి ప్రతీకారంగా అమెరికా సైన్యం ఇరాన్‌పై వైమానిక దాడులు జరపడంతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి ఎదురుదాడిగా ఇరాన్ సైన్యం కూడా అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఆకస్మిక పరిణామాలు కరెన్సీ మార్కెట్‌ను తీవ్ర గందరగోళంలోకి నెట్టేయడంతో రూపాయి విలువ పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు.
0 Comments