Ad Code

తనతో ఫొటో దిగేందుకు మెలోని వేడుకుందన్న ట్రంప్ : ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని

ఫ్రాన్స్‌లో జరిగిన జీ 7 వేదికగా ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యలకు మెలోని ఘాటుగానే స్పందించారు. జీ7 సదస్సు సందర్భంగా తనతో ఫొటో దిగేందుకు మెలోని వేడుకుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆ కథ మొత్తం కల్పితమని, అలాంటి ఘటనే అసలు జరగలేదని స్పష్టం చేశారు. అదంతా పూర్తి కల్పిత కథ అని కొట్టిపారేశారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా మెలోనీ-ట్రంప్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇద్దరూ ఒకే సోఫాపై కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అనంతరం ఓ ఇటాలియన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. "మెలోనీ నాతో ఫొటో దిగేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూసింది. ఆమె నన్ను ఫొటో కోసం వేడుకుంది. నాకు అవసరం లేకపోయినా జాలిపడి ఫొటో దిగాను" అని వ్యాఖ్యానించినట్లు ప్రసారమైంది. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మెలోనీ తీవ్రంగా స్పందించారు.. "అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితం. వాటిని విని నేను ఆశ్చర్యపోయాను. తన మిత్రదేశాల నాయకుల పట్ల ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది మొదటిసారి కూడా కాదు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల ప్రత్యర్థుల పట్ల ట్రంప్ మరింత సానుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. "పశ్చిమ దేశాల శత్రువుల విషయంలో ఆయన చూపించే సహనాన్ని, గౌరవాన్ని తన మిత్రదేశాల నాయకుల పట్ల చూపడం లేదు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.. నేను గానీ, ఇటలీ గానీ ఎప్పుడూ ఎవరి ముందు వేడుకోము" అంటూ ఘాటుగా స్పందించారు. ఈ వివాదం నేపథ్యంలో ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ అమెరికా పర్యటనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. "ప్రధాని మెలోనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇటలీ మొత్తం దేశాన్ని అవమానించాయి" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మెలోనీకి అత్యంత సన్నిహితుడిగా భావించే ప్రధానమంత్రి కార్యాలయ అండర్‌సెక్రటరీ జియోవాన్‌బట్టిస్టా ఫజ్జోలారి కూడా ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "ఉద్దేశపూర్వకంగానో.. లేక అసమర్థత వల్లనో ట్రంప్ అమెరికా-యూరప్ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను దెబ్బతీస్తున్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యల వల్ల యూరప్ అంతటా అమెరికాపై వ్యతిరేక భావన పెరుగుతోంది" అని ఆరోపించారు. గతంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన యూరోపియన్ నాయకుల్లో మెలోనీ ఒకరు. 2025లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఏకైక యూరోపియన్ నాయకురాలు కూడా ఆమెనే. అయితే ఇరాన్ యుద్ధంపై పోప్ లియో చేసిన వ్యాఖ్యలను విమర్శించిన ట్రంప్‌ను మెలోనీ ఇటీవల తప్పుబట్టడంతో ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా మాటల యుద్ధంతో అమెరికా-ఇటలీ సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీ7 సదస్సు తర్వాత మెరుగుపడుతున్నాయని భావించిన ఇరుదేశాల సంబంధాలు మరోసారి సంక్షోభంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu