తెలంగాణ రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో రెవెన్యూ, హౌసింగ్, సమాచార- పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.65 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు వెల్లడించారు. గతంలో పాస్‌బుక్ కోసం రైతులు నెలలతరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులకు ముగింపు పలుకుతూ రైతు దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌బుక్ అందేలా వ్యవస్థను పారదర్శకంగా, వేగవంతంగా రూపొందించామని చెప్పారు. రైతు ఒక్కసారి దరఖాస్తు చేస్తే తిరిగి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జత చేసే నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఐదు మండలాల్లో పరిస్థితులను మంత్రి సమీక్షించారు. ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోందని అధికారులు వివరించగా అక్కడి అనుభవాలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే రెండో దశలో ప్రతి జిల్లాకు ఒక మండలంలో అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు.మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులలో, ఇప్పటివరకు ఆరు లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన దరఖాస్తులకు వచ్చే 15 రోజుల్లో నోటీసులు జారీ పూర్తి చేయాలని, ఆ తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన దరఖాస్తులను పరిష్కారించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం సాదాబైనామా అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దరఖాస్తులు స్వీకరించినప్పటికీ వాటి పరిష్కారానికి 2020 ఆర్వోఆర్ చట్టంలో సరైన నిబంధనలు లేకపోవడం వల్ల వేలాదిమంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కానీ తమ ప్రభుత్వం నిబంధనలను సవరించి దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని మంత్రి పొంగులేటి తెలిపారు.
0 Comments