ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీ అగ్రహారంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ముగ్గురు చిన్నారులను చంపి, అనంతరం తాను ఆత్మహత్యకు చేసుకున్నాడు. కేవీ అగ్రహారానికి చెందిన సుధాకర్ కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో తన కూతుళ్లు అచ్యుత (11), పూజిత (9), లోహిత (8)లను హతమార్చాడు. అనంతరం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానికులు, బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబంలో నెలకొన్న విభేదాలు, కలహాల కారణంగానే సుధాకర్ ఈ దారుణానికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments