పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి గిరిజన నేత ప్రకాష్ చిక్ బరాయిక్ రాజీనామా చేశారు. దీంతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే టీఎంసీ మూడో కీలక నేతను కోల్పోయింది. ఇప్పటికే సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బల తర్వాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ లో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. గురువారం మరో రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్ బరైక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అధికారికంగా సమర్పించనున్నట్లు తెలిపారు. తన రాజీనామా లేఖలో ప్రకాష్ చిక్ బరైక్, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన కాలంలో అందించిన సహకారం, మద్దతుకు డిప్యూటీ చైర్మన్‌తో పాటు రాజ్యసభ సచివాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే రాజీనామాకు గల కారణాలపై స్పష్టత ఇవ్వలేదు. రాజీనామా అనంతరం ప్రకాష్ చిక్ బరాయిక్ బీజేపీ సీనియర్ నేత నిషికాంత్ దూబే నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీ తోటల పేద కార్మికుల హక్కులు, పీఎఫ్ సమస్యలు, సామాజిక సంక్షేమ అంశాలపై పార్లమెంట్‌లో నిరంతరం గళం విప్పిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన తదుపరి రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది.
0 Comments