త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'పీక్' కు సంబంధించిన మొదటి అధికారిక డిజైన్ స్కెచ్‌లను స్కోడా ఆటో విడుదల చేసింది. ఈ నెలాఖరులో జరగబోయే ప్రపంచ ప్రీమియర్‌కు ముందే ఈ కారు బాహ్య రూపం ఎలా ఉండబోతుందో ఈ స్కెచ్‌ల ద్వారా కంపెనీ వెల్లడించింది. ఈ సరికొత్త ఏడు సీట్ల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జూన్ 23న ఫ్రాన్స్‌లోని మొన్నెటియర్-మోర్నెక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా మొదటిసారిగా ప్రదర్శించబడనుంది. విడుదలైన డిజైన్ స్కెచ్‌లు 'పీక్' ఎస్‌యూవీ బోల్డ్ , మినిమలిస్ట్ (సరళమైన) స్టైలింగ్‌ను ప్రతిబింబిస్తున్నాయి. దీనిని స్కోడా సంస్థ తన సరికొత్త 'మోడరన్ సాలిడ్' డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించింది. కారుపై ఉన్న క్లీన్ సర్ఫేసెస్, షార్ప్ లైన్స్ , ప్రత్యేకమైన లైటింగ్ దీనికి రోడ్డుపై ఒక శక్తివంతమైన రూపాన్ని ఇస్తూనే, క్లాసిక్ లుక్‌ను అందిస్తున్నాయి. కారు ముందు భాగం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో సన్నని టీ-షేప్ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, గ్లోస్-బ్లాక్ ఫేస్ , ఒకదానికొకటి అనుసంధానించే లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి కారుకు ఒక ప్రత్యేకమైన లూప్-షేప్ విజువల్ గుర్తింపును ఇస్తున్నాయి. అలాగే, దీని ఫ్రంట్ బంపర్ 'వోల్కానో' ( శైలిలో ఉండి, కారు మరింత వెడల్పుగా, స్థిరంగా కనిపించేలా చేస్తోంది. పక్క నుంచి చూస్తే, పీక్ ఎస్‌యూవీ ఎత్తైన షోల్డర్ లైన్, వెడల్పైన డి-పిల్లర్లు, చక్కగా చెక్కబడిన బాడీ ప్యానెల్స్‌తో నిజమైన ఎస్‌యూవీ రూపాన్ని కలిగి ఉంది. కారు బాడీలోనే కలిసిపోయేలా ఉన్న ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ దీనికి మరింత ప్రీమియం లుక్‌ను ఇవ్వడమే కాకుండా, కారు ప్రయాణంలో గాలిని సులభంగా చీల్చుకుంటూ వెళ్లేలా సహాయపడతాయి. కారు వెనుక భాగం కూడా ముందు వైపు ఉన్న థీమ్‌నే పోలి ఉంటుంది. వెనుక వైపు కూడా టీ-షేప్ టెయిల్-ల్యాంప్స్ అందించారు. ఇవి కూడా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి. స్కోడా సంస్థ రాబోయే రోజుల్లో తీసుకురాబోయే తదుపరి తరం ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ ప్రత్యేకమైన లైటింగ్ స్టైల్ ఒక ముఖ్యమైన విజువల్ గుర్తింపుగా మారనుంది. స్కోడా ఆటో ఎక్స్‌టీరియర్ డిజైన్ హెడ్ కార్ల్ నైహోల్డ్ మాట్లాడుతూ.. ఈ పీక్ ఎస్‌యూవీ సరైన కొలతలు, అద్భుతమైన బాడీ షేప్స్ , బ్రాండ్ ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్స్ కలయికతో ఎలక్ట్రిక్ యుగంలో స్కోడా సరికొత్త గుర్తింపును చాటిచెబుతుందని అన్నారు. ముఖ్యంగా టీ-షేప్ లైటింగ్ , టెక్-డెక్ ఫేస్ లు ఈ ఎస్‌యూవీ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. స్కోడా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా రాబోతున్న 'పీక్'.. ఆ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోనే అతిపెద్ద బ్యాటరీ-ఎలక్ట్రిక్ మోడళ్లలో ఒకటిగా నిలవనుంది. మూడు వరుసల సీటింగ్ తో వచ్చే ఈ కారులో ఏడుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
0 Comments