తెలంగాణలో జూన్ 5 నుంచి సవరించిన భూముల ధరలు అమల్లోకి రానున్నాయి. భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ధరలను సవరిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూముల విలువల సవరణను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక మేరకు ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ప్రాంతాల వారీగా మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ విలువల మధ్య వ్యత్యాసాలను పరిశీలించి శాస్త్రీయ పద్ధతిలో కొత్త విలువలను నిర్ణయించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమగ్ర కసరత్తు లేకుండా.. అశాస్త్రీయ పద్దతుల్లో 2021-22 సంవత్సరాల్లో కేవలం 6 నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూముల ధరలను పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సవరణలు క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కేవలం శాతం గణనల ఆధారంగా, పట్టికల ప్రకారం చేపట్టడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా విలువలు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
0 Comments