దేశంలో టెలిగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది. నీట్ 2026 రీ-ఎగ్జామ్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారం లేదా ఇతర అవకతవకలను అరికట్టే లక్ష్యంతో జాతీయ పరీక్షల ఏజెన్సీ సిఫార్సుల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష నిర్వహణ సమయంలో మాత్రమే ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, అవి శాశ్వత నిషేధం కాదని స్పష్టం చేశారు. ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్ (యూజీ) 2026 పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22.75 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 22 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సమానమైన వందలాది ప్రశ్నలు ముందుగానే చక్కర్లు కొట్టినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించడంతో పరీక్ష విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ సంయుక్తంగా మే 3న జరిగిన పరీక్షను రద్దు చేసి జూన్ 21న పునఃపరీక్ష నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఎన్‌టీఏ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో కొందరు వ్యక్తులు టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి, ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను తర్వాత మార్చి వాటికి అసలు టైమ్‌స్టాంప్‌ను అలాగే ఉంచడం ద్వారా “పేపర్ లీక్” జరిగినట్లు తప్పుడు ఆధారాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 30 వరకు భారతదేశంలో టెలిగ్రామ్ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 21న జరగనున్న నీట్ పునఃపరీక్షను లక్ష్యంగా చేసుకుని కొంతమంది మోసగాళ్లు టెలిగ్రామ్ ద్వారా ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఎన్‌టీఏ గుర్తించింది.
0 Comments