Ad Code

కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్ : 21 మంది సైనికులు దుర్మరణం!

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోని ముజఫరాబాద్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న 21 మంది సైనిక సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన 'ఎమ్.ఐ-17' హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ హెలికాప్టర్ పాకిస్తాన్ భద్రతా దళాలకు చెందిన సైనికులను తీసుకుని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నీలమ్ వ్యాలీ సెక్టార్‌కు అదనపు బలగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాశంలో ఉండగానే హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. ప్రమాదాన్ని నివారించేందుకు క్రూ సిబ్బంది హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయితే సురక్షితంగా కిందకు దించే లోపే నియంత్రణ కోల్పోయిన హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో వేగంగా కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, సైనిక రెస్క్యూ, రికవరీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. తీవ్రమైన మంటల మధ్య శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది. హెలికాప్టర్ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను, సాంకేతిక లోపాన్ని అంచనా వేయడానికి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు పాకిస్తాన్ సైనిక మీడియా విభాగం 'ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్' ఓ ప్రకటనలో వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu