హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 లీగ్‌లో ఖమ్మం శుభారంభం చేసింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ ఆరంభ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఖమ్మం 20 పరుగుల తేడాతో పాలమూరు టీమ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అన్వితా ఖమ్మం ఏసెస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 237 పరుగులు చేసింది. వాఫి కచ్చి(30 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 60), హిమతేజ(24 బంతుల్లో ఫోర్, 7 సిక్స్‌లతో 59 నాటౌట్), సాయికృష్ణా రెడ్డి(32 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 60) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం పాలమూరు టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులే చేసి ఓటమిపాలైంది. విఘ్నేశ్ రెడ్డి(31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 86) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఖమ్మం బౌలర్లలో వేద్ రెడ్డి(2/42), విద్యానంద రెడ్డి(1/31) రాణించారు. ఈ మ్యాచ్‌కు ముందు హెచ్‌సీఏ ఏర్పాటు చేసిన ఆరంభ వేడుకలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ దేవరకొండ సండడి చేయగా.. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చీఫ్ గెస్ట్‌గా ఈ వేడుకుల హాజరయ్యారు. మొదట టీజీ20 ట్రోఫీని మైదానంలోకి తీసుకురాగా తర్వాత 8 జట్ల ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యాజమానులు వచ్చారు. భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరినాథ్, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగంరావు, హెచ్‌సీఏ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు, మహమ్మద్ సిరాజ్, హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్‌రెడ్డి, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ సంజీవ్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణలోని యువ క్రికెటర్లందరికీ ఇది గొప్ప వేదికని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భట్టి విక్రమార్క అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన చిన్నప్పుడు కర్ణాటక నుంచి నలుగురు ఆటగాళ్లు భారత్ జట్టుకు ఆడేదని, తెలంగాణ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ మాత్రమే ఉండేవారన్నారు. కానీ ఇప్పుడు తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్ లాంటి వారు భారత్‌కు ఆడుతున్నారని, తెలంగాణ నుంచి మరింత మంది జాతీయ జట్టుకు ఆడాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు. అందుకు ఈ లీగ్ దోహదపడుతుందని ఆశిస్తున్నాని తెలిపాడు.
0 Comments