Ad Code

కోవిడ్‌-19 వైరస్‌ : వుహాన్ ల్యాబ్‌కు ఆంథోనీ ఫౌచీ నిధులు ఇచ్చారు : అమెరికా జాతీయ నిఘా సంస్థ మాజీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌

చైనాలోని వుహాన్ ల్యాబ్‌కు ఆంథోనీ ఫౌచీ నిధులు ఇచ్చారు, కోవిడ్ వాస్తవాలను దాచారంటూ అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించి ఇప్పటికీ సాగుతున్న వివాదంలో సరికొత్త అగ్గి రాజేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మాజీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ చైనాలోని వుహాన్ రీసెర్చ్ ల్యాబ్‌కు నిధులు సమకూర్చారని, ఈ ల్యాబ్ నుంచే కోవిడ్-19 మహమ్మారి వ్యాపించిందని అమెరికా అవుట్‌గోయింగ్ డీఎన్‌ఐ చీఫ్‌ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. తన అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకోవడానికి గత నెలలో డోనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ.. నిజాన్ని దాచడానికి ఆంథోనీ ఫౌచీ ఉపయోగించిన వ్యూహాలు "డీప్ స్టేట్ ప్లేబుక్" నుండి వచ్చినవేనని అన్నారు. తన పదవీకాలం చివరి రోజున కొన్ని 'ఇంతకుముందెన్నడూ చూడని' రహస్య పత్రాలను విడుదల చేస్తూ ఈ విషయాలను వెల్లడించారు. 2020లో అమెరికాకు కోవిడ్ సోకినప్పుడు బైడెన్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ఫౌచీ, వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో "బాట్ కరోనావైరస్‌లపై ప్రమాదకరమైన గెయిన్-ఆఫ్-ఫంక్షన్ పరిశోధనల" కోసం అమెరికా పన్ను చెల్లింపుదారుల మిలియన్ల డాలర్ల నిధులను అందించారని గబ్బార్డ్ పేర్కొన్నారు. వైరస్ ల్యాబ్ నుండి లీక్ అయిందనే నిజాన్ని కప్పి పుచ్చడానికి ఫౌచీ కెరీర్ లీడర్‌షిప్‌తో కలిసి పనిచేశారని తులసి గబ్బార్డ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ట్రిలియన్ డాలర్ల వ్యాక్సిన్ వ్యాపారం కోసం వైరల్ పరిశోధనల గురించి ఇంటెలిజెన్స్ అధికారులతో జరిపిన చర్చలపై 2024లో అమెరికా పార్లమెంట్ ముందు ప్రమాణం చేసి ఫౌచీ అబద్ధాలు చెప్పారని వెల్లడించింది. డిసెంబర్ 2022లో పదవి నుంచి వైదొలగే వరకు 38 ఏళ్లపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కు అధిపతిగా పనిచేసిన 85 ఏళ్ల ఫౌచీ, పెద్ద ఫార్మా కంపెనీలతో చేతులు కలిపి "రిస్కీ కరోనావైరస్ పరిశోధనల"కు నిధులు ఇచ్చారని గబ్బార్డ్ కార్యాలయం ఆరోపించింది. ట్రిలియన్ల డాలర్ల విలువైన "యూనివర్సల్ వ్యాక్సిన్ల" వేట కోసం ఇదంతా జరిగిందని పేర్కొంది. డాక్టర్ ఫౌచీ వంటి రాజకీయ ప్రేరేపిత,స్వార్థపూరిత నాయకులు తమ సొంత తప్పులను, అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చు కున్నారు, ఇంటెలిజెన్స్‌ను తారుమారు చేశారు, కాంగ్రెస్‌కు అబద్ధాలు చెప్పారు, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి అవసరమైన కీలక వాస్తవాలను తెలుసుకోకుండా చట్టబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని అడ్డుకోవడం ద్వారా ఆయనను బలహీన పరిచారంటూ ఆమె ధ్వజమెత్తారు. "కోవిడ్-19 మహమ్మారి మిలియన్ల మంది అమెరికన్లకు ,ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మందికి అపారమైన కష్టాలను, నష్టాన్ని మిగిల్చింది. ఏళ్ల తరబడి సాగిన అబద్ధాలు, సెన్సార్‌షిప్ కప్పిపుచ్చుకునే ధోరణుల తర్వాత, అమెరికా ప్రజలకు పారదర్శకత, నిజం మరియు జవాబుదారీతనం లభించాల్సిన అవసరం ఉంది." అని తులసి గబ్బార్డ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు జూన్ 2024లో జరిగిన పబ్లిక్ కాంగ్రెస్ విచారణలో ఫౌచీ అబద్ధాలు చెప్పారని ఆమె కార్యాలయం స్పష్టం చేసింది. మహమ్మారికి ముందు లేదా తర్వాత వైరల్ పరిశోధనలకు సంబంధించి ఎఫ్‌బీఐ, సీఐఏ , డీఐఏ  లేదా ఏదైనా యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో మాట్లాడారా అని ఫౌచీని పదే పదే ప్రశ్నించినపుడు ఆయన మాట దాటవేశారని, కోవిడ్ గురించి నాకు తెలిసి తప్పు మాట్లాడలేదని తప్పుడు ప్రకటన చేశారని పేర్కొంది. ఫౌచీ కోవిడ్ నివేదికలను సవాలు చేసిన ఇంటెలిజెన్స్ విశ్లేషకులు ప్రతీకార చర్యలను ఎదుర్కొన్నారని, వారిని పక్కన పెట్టడంతోపాటు, వారి కెరీర్‌కు నష్టం వాటిల్లిందని పలువురు విజిల్ బ్లోవర్ల సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి, ఈ భయాల వల్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే వారి నోళ్లు మూయించారని గబ్బార్డ్ కార్యాలయం వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu