Ad Code

మొబైల్ ఫోన్ లో స్టంట్ చూసి అనుకరిస్తూ 11 ఏళ్ల బాలుడు దుర్మరణం

త్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో మొబైల్ ఫోన్‌లో చూసిన ఒక ప్రమాదకరమైన స్టంట్‌ను గుడ్డిగా అనుకరించబోయి 11 ఏళ్ల పాఠశాల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పిల్లల మొబైల్ వాడకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతవరకు అవసరమనే అంశాన్ని మరోసారి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం చేసింది. పోలీసులు, మకన్‌పూర్ ఖాదర్ గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తికి నలుగురు సంతానం కాగా, వారిలో వంశ్ (11) ఏకైక కుమారుడు. స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న వంశ్, రోజూ మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఆడటం, ప్రమాదకరమైన స్టంట్ వీడియోలు చూడటం అలవాటుగా మార్చుకున్నాడు. ఘటన జరిగిన రోజు ఇంట్లో మిగతా పిల్లలు ఆడుకుంటుండగా, వంశ్ తన గదిలోకి ఒంటరిగా వెళ్లాడు. మొబైల్‌లో చూసిన ఒక స్టంట్‌ను ప్రయోగాత్మకంగా తానే స్వయంగా చేయడానికి ప్రయత్నించాడు. ఆ స్టంట్ చేస్తున్న క్రమంలో అతడు మెడకు వేసుకున్న గుడ్డ అకస్మాత్తుగా బిగుసుకుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో ఆ చిన్నారి గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నలుగురు అక్కాచెల్లెళ్ల మధ్య అల్లారుముద్దుగా పెరుగుతున్న ఏకైక కొడుకు ఇలా విగతజీవిగా మారడంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదంపై సమాచారం అందుకున్న దంకోర్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాలుడు ఏ రకమైన స్టంట్ లేదా ఆన్‌లైన్ ఛాలెంజ్‌ను అనుకరించాడో తెలుసుకునేందుకు అతడి మొబైల్ హిస్టరీని విశ్లేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో నిర్దిష్టమైన గేమ్ లేదా వీడియోకు సంబంధించిన ప్రత్యక్ష ఆధారాలు ఇంకా లభించలేదన్నారు. మరోవైపు, తీవ్ర శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులు బాలుడి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు నిరాకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu