భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎంపీ రాఘవ్ చద్దా ఈరోజు ఉదయం కలిశారు. మరో ముగ్గురు ఎంపీలతో కలిసి వెళ్లిన ఆయన, పంజాబ్ ప్రభుత్వం తమను లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. గతంలో ఆప్ నుంచి గెలిచిన ఎంపీలలో మూడింట రెండు వంతుల మంది బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్న తర్వాత, తమ రాజ్యాంగ హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాజకీయ కక్ష సాధింపు చర్యల గురించి గొంతెత్తిన ఆప్ పార్టీ, ఇప్పుడు అంతకంటే విషపూరితమైన రీతిలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని రాఘవ్ చద్దా విమర్శించారు. అయితే, రాజ్యాంగపరమైన హక్కులను, ప్రజాస్వామ్య నిర్ణయాలను తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని రాష్ట్రపతి హామీ ఇచ్చారని, అది తమకు ఎంతో బలాన్ని ఇచ్చిందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పంజాబ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉండగా బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులపై ఫిర్యాదు చేసేందుకు పంజాబ్ సీఎం సహా ఇతర మంత్రులు రాష్ట్ర పతి ముర్మును కలిసేందుకు ఢిల్లీకి చేరారు.
0 Comments