రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ ఫోన్ల కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. చాలామంది కొత్త స్మార్ట్‌ఫోన్లను సులభ వాయిదాల పద్ధతి లేదా లోన్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఏదైనా ఆర్థిక ఇబ్బంది వల్ల ఒకటి లేదా రెండు ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే, సదరు ఫైనాన్స్ కంపెనీలు లేదా బ్యాంకులు రిమోట్ యాక్సెస్ ద్వారా వినియోగదారుల ఫోన్లను పూర్తిగా బ్లాక్ చేస్తున్నాయి. దీనివల్ల ఫోన్ అసలు ఆన్ కాకపోవడం, అత్యవసర కాల్స్ కూడా చేసుకోలేకపోవడం వంటి సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ విధానంపై ఆర్‌బీఐ తాజాగా స్పష్టతనిచ్చింది. ఈరోజు విడుదల చేసిన సవరించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాల ప్రకారం లోన్ బకాయిలు చెల్లించలేదనే కారణంతో కస్టమర్ల మొబైల్ ఫోన్లను పూర్తిగా బ్లాక్ చేయడం లేదా డిసేబుల్ చేయడం చట్టవిరుద్ధమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు కానీ, ఇతర ఆర్థిక సంస్థలు కానీ ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని నియంత్రణ సంస్థ గట్టిగా తేల్చిచెప్పింది.అయితే లోన్ రికవరీ కోసం బ్యాంకులకు ఆర్‌బీఐ కొన్ని మినహాయింపులను ఇచ్చింది. ఈఎంఐలు సకాలంలో చెల్లించనప్పుడు, సదరు మొబైల్‌లోని కొన్ని రకాల ఫీచర్లను లేదా యాప్‌లను తాత్కాలికంగా పరిమితం చేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది. కానీ, ఫోన్‌ను యాక్సెస్ చేయకుండా పూర్తిగా లాక్ చేయడం కస్టమర్ల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది.
0 Comments