హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో మంగళవారం ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న ఒక ఆర్టీసీ బస్సులో హఠాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. గద్వాల డిపోకు చెందిన బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు చెలరేగడంతో బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బస్సు ఇంజిన్ భాగం నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించడాన్ని గమనించిన డ్రైవర్, కండక్టర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనల నడుమ ఒకరినొకరు నెట్టుకుంటూ, ప్రాణాలు చేతబట్టుకుని బస్సు దిగి ప్లాట్‌ఫాంపైకి పరుగులు తీశారు. సమయస్ఫూర్తితో ప్రయాణికులందరూ త్వరగా కిందకు దిగడంతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతలోనే మంటలు బస్సు మొత్తానికి వేగంగా విస్తరించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇంజిన్ వేడెక్కడం వల్ల జరిగిందా అనే కోణంలో ఆర్టీసీ అధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
0 Comments