తమిళనాడులోని నాగర్‌కోయిల్‌కు చెందిన సెంథిల్ కుమార్ (35) మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన సునీత (34) అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 14 ఏళ్ల కుమారుడు సజిన్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండటంతో, మూడు రోజుల క్రితం సునీత కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, నిన్న సెంథిల్ కుమార్ అక్కడికి వెళ్లి ఆమెను బతిమిలాడి ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ సాయంత్రం వారి మధ్య గొడవ మొదలైంది. ఆ సమయంలో కుమారుడు సజిన్‌ను బయట పంపించారు. కుమారుడు తిరిగి వచ్చేసరికి తల్లి, తండ్రి ఇద్దరూ రక్తపు మడుగులో విగతజీవులై ఉండటం చూసి సజిన్ షాక్‌కు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో సెంథిల్ కుమార్‌కు మరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయాన్ని సునీత నిలదీయడంతోనే గొడవలు మొదలయ్యాయని తేలింది. నిన్న జరిగిన గొడవలో సెంథిల్ కుమార్ కత్తితో సునీతను నరికి చంపి, ఆ తర్వాత అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
0 Comments