Ad Code

విక్రమ్ ల్యాండర్ హాప్ ఎక్స్‌పెరిమెంట్ : బయటపడ్డ అసలైన మట్టి పొరలు


చంద్రునిపై పరిశోధనలు ముగించే దశలో విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా నిర్వహించిన 'హాప్ ఎక్స్పెరిమెంట్' పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కీలక వివరాలను వెల్లడించారు. ఈ ప్రయోగంలో భాగంగా ల్యాండర్ చంద్రుడి ఉపరితలం నుండి సుమారు 40 నుంచి 50 సెంటీమీటర్లు పైకి ఎగిరి, కొద్దిదూరం పక్కకు జరిగి మళ్లీ సురక్షితంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఈ అసాధారణ ప్రక్రియ వల్ల ల్యాండర్ ఇంజన్ల నుండి వెలువడిన ఒత్తిడికి చంద్రుడి ఉపరితలంపై ఉన్న పై పొర కొట్టుకుపోయి, లోపల దాగి ఉన్న అసలైన మట్టి పొరలు బయటపడ్డాయి. ఈ క్రమంలో విక్రమ్ ల్యాండర్ లోని 'చంద్ర సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్' అనే అత్యాధునిక పరికరం లోపలి మట్టిని లోతుగా పరిశీలించే అవకాశం లభించింది. ఈ అధ్యయనంలో చంద్రుడి మట్టి అంతా ఒకేలా కాకుండా వివిధ పొరలుగా ఉందనే ఆసక్తికరమైన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుని ఉపరితలం పైభాగం పొర చాలా మెత్తటి ధూళిలా ఉండగా, దాని కింద ఉన్న లోపలి భాగం మాత్రం మరింత ఘనంగా, గట్టిగా ఉందని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. జాబిల్లి నేల స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో ఈ ఆవిష్కరణ అత్యంత కీలకమైనదిగా నిపుణులు భావిస్తున్నారు. చంద్రయాన్-3  సేకరించిన ఈ అమూల్యమైన డేటా భవిష్యత్తులో చేపట్టబోయే అంతర్జాతీయ చంద్ర మిషన్లకు దిక్సూచిగా మారనుంది. ముఖ్యంగా నాసా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఆర్టెమిస్ మిషన్' ద్వారా చంద్రుడిపై మానవ సహిత శాశ్వత స్థావరాలను ఏర్పాటు చేయాలనే ప్రపంచ దేశాల ప్రణాళికలకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడనుంది. 2023 జూలై 14న నింగిలోకి ఎగిరి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన చంద్రయాన్-3, ల్యాండింగ్ ముగిసిన తర్వాత కూడా అంతరిక్ష విజ్ఞానానికి కీలకమైన విశ్లేషణను అందించడం విశేషం.

Post a Comment

0 Comments

Close Menu