పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి మీడియా సమావేశంలో మంగళవారంనాడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందన్నారు. బీజేపీకి ఈసీ ఏజెంట్‌గా మారిందని ఆక్షేపణ తెలిపారు. ఈ ఎన్నికలో ప్రధాన విలన్ ఎన్నికల సంఘమేనని విమర్శలు గుప్పించారు. 'ఈ ఎన్నికల్లో విలన్‌గా ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు. బెంగాల్‌లో ఈవీఎంలను లూటీ చేశారు' అని మమత ఆరోపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 80 నుంచి 90 శాతం కంటే ఎక్కువ బ్యాటరీని కలిగి ఉండటం ఏమిటి ? అని ప్రశ్నించారు. పోలింగ్‌కు రెండ్రోజుల ముందే అధికారులు తమ పార్టీపై దాడులు, కార్యకర్తల అరెస్టులు చేశారని అన్నారు. భవనీపూర్‌లో ఉద్దేశపూర్వకంగానే ఒక ప్లాన్ ప్రకారం తనను ఓడించారని, ఎన్నికల కమిషన్‌ను దుర్వినియోగపరిచి బీజేపీ విజయం సాధించిందని, తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదని అన్నారు. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ కార్యకర్తలను కొట్టారని, తనపై కూడా దాడి చేశారని ఆరోపించారు. ఎస్ఐఆర్ నుంచి 90 లక్షల ఓట్లను తొలగించారనీ, కోర్టుకు వెళ్లడంతో 32 లక్షల ఓట్లు చేర్చారని, టీఎంసీని ఓడించేందుకు అన్నిరకాలుగా ఎత్తుగడలు పన్ని వంద సీట్ల వరకూ బీజేపీ లూటీ చేసిందని విమర్శించారు. ఈ మొత్తం ఉదంతంలో 'ఇండి' కూటమి తన వైపే ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తనతో మాట్లాడారని, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ తదితరులు ఫోను చేసి సపోర్ట్‌గా నిలిచారని చెప్పారు. 'ఇండి' కూటమిలోనే తాను కొనసాగుతానని కూడా స్పష్టం చేశారు.
0 Comments