ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయింపు !


భారత్ ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో సిటీ తరహాలోనే డిజైన్స్ ఉండాలని, మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో రాజీ పడొద్దని అన్నారు. ఇక్కడ భూమి కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటుపై ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలని, అంతర్జాతీయస్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలి కోరారు. ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలన్నారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరం అయితే ప్రధాని మోడీని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దామన్నారు. జూన్‌లో ఫ్యూచర్ సిటీ ఇండ్రస్టియల్ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగేలా చూడాలన్నారు. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమలు నిర్మాణం మొదలు పెట్టేలా నిబంధన విధించాలని సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ పేరులో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని, ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ఆకర్షణీయమైన లోగో, వెబ్‌సైట్ రూపొందించాలని, ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థని రూపొందించాలని, గ్రూప్-1 స్థాయి అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్‌గా నియమించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయాలన్నారు. బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలని, 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలని, .డేటా సిటీ నీటి అవసరాల కోసం ఎస్‌టీపీలను వినియోగించాలని, జీసీసీలు, డేటా సెంటర్ల కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలని, ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీల ఏర్పాటుపై దృష్టి పెట్టేలా పాలసీ రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్‌కు కనెక్ట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) వైస్ చైర్మన్ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం