Ad Code

పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు


ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్ధితి వుంది. ఈరోజు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సీజన్ లోనే అత్యధికంగా 47.6 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. రానున్న నాలుగురోజులు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తోంది. రాష్ట్రంలోని 28 జిల్లాలకుగాను 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని వాతావరణ విభాగం తెలిపింది. పల్నాడు జిల్లాలో 23, కృష్ణాలో 21, ప్రకాశంలో 20, ఏలూరులో 20, బాపట్లలో 17, నెల్లూరులో 16, ఎన్టీఆర్ లో 15, గుంటూరులో 15, మార్కాపురం జిల్లాలోని 12 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. రేపు గురువారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 - 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 - 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu