హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 3.05 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయ ప్రయాణికుల నుంచి సుమారు 8.705 కిలోల అత్యంత నాణ్యమైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు అనుసరించిన పద్ధతి చూసి అధికారులు సైతం విస్తుపోయారు. పట్టుబడిన డ్రగ్స్‌ను 24 నల్లటి ప్యాకెట్లలో ప్యాక్ చేసి, వాటిని ఇన్సులేటెడ్ వాటర్ బాటిళ్లు, చిప్స్ టిన్లు, ఫుడ్ కంటైనర్లు, కార్డ్ బోర్డ్ బాక్సులలో అత్యంత చాకచక్యంగా దాచారు. అయితే, పక్కాగా అందిన ఇంటెలిజెన్స్ సమాచారంతో అధికారులు ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అసలు రంగు బయటపడింది. సాధారణ గంజాయి కంటే ఇది ఎంతో శక్తివంతమైనది , ఖరీదైనది. నేల అవసరం లేకుండా కేవలం నీటి ఆధారిత పోషకాలతో , కృత్రిమ కాంతిలో ఇండోర్ సెటప్‌లో దీనిని సాగు చేస్తారు. ఇందులో టిహెచ్‌సి స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల డ్రగ్ మాఫియాలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే దీని ధర కోట్లలో పలుకుతుంది. డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న డ్రగ్స్ నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో, వారిద్దరినీ NDPS చట్టం కింద అరెస్ట్ చేశారు.
0 Comments