కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలో రేపటి నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభంకానున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. రేపు గురువారం ప్రారంభమై మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకూ పుష్కరాలు జరగునున్నట్లు తెలిపింది. ఈ అంత్యపుష్కరాలకు దాదాపు 40 లక్షల ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని అయిన సరస్వతి నదుల సంగమం. ఈ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయి, ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం 12 రోజుల పాటు వివిధ రకాల హోమాలు,పూజలు నిర్వహించబడతాయని ఆలయ అధికారులు తెలిపారు. మే 21 ఉదయం 5:43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ద్వారా పుష్కర స్నానం ప్రారంభమవుతుంది. రాష్ట్ర గవర్నర్ కూడా ఈ పుణ్యస్నానంలో పాల్గొననున్నారు. ప్రతి రోజు వివిధ పీఠాధిపతులు పాల్గొని హోమాలు, సాయంత్రం హారతి, తెప్పోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 21న మహా గణపతి హోమం నుంచి ప్రారంభమై జూన్ 1న లఘు చండి మహా పూర్ణాహుతితో ముగుస్తాయని అధికారులు తెలిపారు.
0 Comments