Ad Code

సింగరేణిలో అగ్గి పుట్టిస్తా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


తెలంగాణలోని మంచిర్యాల జిల్లా  బీఆర్ఎస్ భవన్ లో  నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డును నిర్వహించకుండా కార్మికులను, వారి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డును నిర్వహించాలని, లేనిపక్షంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే "బొగ్గు గనుల్లో అగ్గి మండిస్తాం" అని ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపారు. సింగరేణిలో పనులన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి ఆదేశాల మేరకే జరుగుతున్నాయని, అంతా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. దీనిపై సిట్ (SIT) లేదా ఏసీబీ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్ విసిరారు. గతంలో ఇచ్చిన ఉద్యోగాలపై ఏసీబీ విచారణ చేస్తామంటున్న భట్టి విక్రమార్క, ముందుగా ప్రస్తుతం జరుగుతున్న సింగరేణి అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాము ఎలాంటి ఏసీబీ విచారణలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "గాడిదలకు గడ్డేసి.. ఆవుకు పాలు పిండితే వస్తాయా?" అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం తమను అడగడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కార్మికులు, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల గల్లా పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu