హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక సిద్ధి వినాయక క్లాత్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ షోరూంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న బట్టలు, ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. షోరూంలో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మరియు కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments