ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్గాట్-వేఫర్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోందని, పెట్టుబడుల్లో ఈ జిల్లా భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుందన్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం లక్షా 85 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పారు. తొందర్లోనే ఏపీఎస్ ఆర్టీసీకి 1050 ఈవీ బస్సులు వస్తాయని, భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామన్నారు. ప్రతీ ఇళ్లు ఓ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని, రైతులు కూడా పొలం దగ్గరే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. విద్యుత్ చార్జీలు పెంచమని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, భవిష్యత్తులోనూ చార్జీలు పెంచమని రాంబిల్లి నుంచి ప్రజలకు హామీ ఇస్తున్నాని సీఎం తెలిపారు. '2024 ముందు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, అభివృద్ది ఆగిపోయింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి రీన్యూ ఎనర్జీ ముందుకు వచ్చింది. విద్యుత్ చార్జీలు పెంచమని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అనాలోచిత నిర్ణయాలు, అవినీతి కారణంగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. గత ప్రభుత్వం 32 వేల కోట్లు ప్రజలపై విద్యుత్ భారం మోపింది. 160 గిగా వాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆర్టీసీలో వెయ్యి ఈవీ బస్సులు రానున్నాయి. ఆర్టీసీ బస్సులు అన్నీ ఈవీ బస్సులుగా వస్తాయి. పేద వాళ్లకు ఈ సౌకర్యం అందుబాటలోకి తేవడం కోసం పనిచేస్తున్నాం. ప్రతీ ఇల్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలి. అవసరాలు తీరిన తర్వాత తిరిగి గ్రిడ్ కు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కిల్లర్ పార్టీ అని, ఆ పార్టీలోని కొందరు నాయకులు సొంత వాళ్లనూ చంపేస్తారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకానందారెడ్డి, వైసీపీ నేత పెద్ద దస్తగిరిహత్యలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే చంపేస్తారని, ఆ తర్వాత కూడా పరామర్శలు కూడా వాళ్లే చేస్తారని తెలిపారు. నేరస్తులైన ప్రతిపక్ష నాయకులతో తాను రాజకీయాలు చేస్తున్నానని వ్యాఖ్యానించారు.సొంతపార్టీ నేతలను చంపే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో హత్యారాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేశారని, అంతేకాకుండా సాక్షులను సైతం డబ్బులిచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇవి పాత రోజులుకావని, తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. 2019-24 మధ్య ఏపీలో విధ్వంసం జరిగిందని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని వైసీపీ కుప్పకూల్చిందని మండిపడ్డారు. జగన్ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని.. ఉచితంగా కరెంట్ వచ్చే సోలార్‌ను వినియోగించుకోలేదన్నారు. విద్యుత్ సంస్థలపై రూ.12 వేల కోట్ల భారం మోపారన్నారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు వెనక్కిపోయాయని సీఎం అన్నారు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నామని, భవిష్యత్తులో ఆర్టీసీలో కేవలం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. సామాన్యుడికి కూడా విలాసవంతమైన ప్రయాణాన్ని చేరువ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏసీ బస్సుల్లో కేవలం డబ్బున్న వారు మాత్రమే ప్రయాణించాలనే నిబంధన ఎక్కడా లేదన్నారు. పేద ప్రజలు కూడా ఎంతో గౌరవంగా, హాయిగా ఏసీ బస్సుల్లో ప్రయాణించాలన్నదే తన కొరిక అని తెలిపారు.
0 Comments