Ad Code

బీజేపీతో ఎల్‌డీఎఫ్ రహస్య పొత్తు : ప్రియాంక గాంధీ ఆరోపణ


కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మలప్పురంలో మాట్లాడుతూ బీజేపీ, సీపీఎం పార్టీలపై విరుచుకుపడ్డారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయని ఆరోపించారు. బీజేపీతో సీపీఎం కుమ్మక్కయిందని విమర్శించారు. మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం కాషాయ పార్టీతో కమ్యూనిస్టులు డీల్ చేసుకున్నారని అన్నారు. పదేళ్లపాటు అధికారంలో కొనసాగడం కోసం అధికార ఎల్‌డీఎఫ్ సిద్ధాంతం, జవాబుదారీతనం, బాధ్యతల విషయంలో రాజీ పడుతోందని ఆరోపించారు. మైనారిటీలను, ముఖ్యంగా క్రైస్తవులను వేధించే బీజేపీతో ఎల్‌డీఎఫ్ ఒప్పందం చేసుకుందని దుయ్యబట్టారు. ఎల్‌డీఎఫ్ నేతలు, మంత్రుల్లో అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు. ప్రజల పట్ల ప్రతి నాయకుడికి ఉండాల్సిన బాధ్యత, జవాబుదారీతనం కొరవడిందని మండిపడ్డారు. శబరిమలలో భారీగా దొంగతనం జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కనీస స్పందన కరువైందని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ వ్యవహారంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని, బీజేపీ -ఎల్‌డీఎఫ్ ఒప్పందానికి ఇంత కంటే ఏం సాక్ష్యం కావాలని ప్రశ్నించారు. ఎవరైనా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా గళం విప్పితే వారు సీబీఐ, ఈడీ లేదా ఆదాయపు పన్ను కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై అలాంటి ఒక్క కేసు కూడా లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీతో ఎల్‌డీఎఫ్ రహస్య పొత్తు పెట్టుకుందని ఇంతకుముందే రాహుల్ గాంధీ ఆరోపించారు. మైనార్టీలపై దాడులు చేయించిన బీజేపీతో ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నించారు. మోడీకి కేరళ సీఎం భయపడుతున్నారని, తన కేసుల నుంచి కూతురిని కాపాడుకునేందుకు బీజేపీ చెప్పినట్టల్లా వింటున్నారని విమర్శించారు. ఎల్‌డీఎఫ్‌-బీజేపీ ఒప్పందం కుదుర్చుకున్నాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలనే తాజాగా ప్రియాంక గాంధీ ఉటంకించారు. ఒకే దెబ్బతో రెండు పార్టీలకు చెక్ పెట్టాలన్న వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ అగ్ర నేతలు ఈ ఆరోపణలు చేస్తున్నట్టు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆరోణలను అధికార ఎల్‌డీఎఫ్ నాయకులు తోసిపుచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu