తెలంగాణలోని హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగుచూసింది. మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే వికృత ఆలోచనతో అజారుద్దీన్ అనే వ్యక్తి తన భార్య ఫర్హాత్ (26), కుమార్తెలు ఉమేరా (8), అయేషా (6)లను అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకున్నాడు. నిందితుడు పున్నేలు గ్రామ శివారులో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ అక్కడే తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, మరోసారి భార్య గర్భం దాల్చడం ఈ ఘోరకలికి దారితీసింది. గతంలో కూడా ఫర్హాత్ రెండుసార్లు గర్భం దాల్చగా, ఆడపిల్లలే పుడతారనే నెపంతో అజారుద్దీన్ ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ గర్భవతి కాగా, ఈసారి కూడా గర్భం తొలగించుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అయితే ఫర్హాత్ అందుకు ససేమిరా అనడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం భార్యాపిల్లలను తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి, ముగ్గురినీ నీటిలోకి తోసేసి ప్రాణాలు తీశాడు. అనంతరం ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు చిత్రీకరించేందుకు డ్రామా ఆడాడు. ఫర్హాత్ మరణంపై ఆమె తండ్రికి అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు అజారుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అన్న అనుమానంతోనే తానే స్వయంగా ముగ్గురిని చంపినట్లు అజారుద్దీన్ అంగీకరించాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, అందులోనూ పసిపిల్లలు కన్నతండ్రి చేతిలోనే బలికావడం జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
0 Comments