దేశంలో పవనవిద్యుత్ (విండ్ ఎనర్జీ) ఉత్పత్తి సామర్థ్యం వేగంగా విస్తరిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.05 గిగావాట్ల విండ్ ఎనర్జీ సామర్థ్యం ఏర్పాటైనట్టు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఒక ఏడాదిలో ఏర్పాటైన అత్యధిక సామర్థ్యం ఇదని పేర్కొంది. 2016-17లో ఏర్పాటైన 5.5 గిగావాట్ల విండ్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు రికార్డును అధిగమించినట్టు అయింది. దీంతో 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 56 గిగావాట్లకు చేరుకుంది. ప్రభుత్వ విధానాల్లో పెరిగిన స్పష్టత, పోటీ మార్గంలో టారిఫ్‌ల నిర్ణయం, సరఫరా నెట్‌వర్క్ సిద్ధంగా ఉండడం వంటివి కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి పెరడానికి దారితీసినట్టు పునరుత్పాదక ఇంధన శాఖ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఏర్పాటైన విండ్ ఎనర్జీలో ఎక్కువ భాగం కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో ఉండడం గమనార్హం.
0 Comments