ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఒక మహిళపై గుర్తు తెలియని దుండగుడు పాశవికంగా దాడి చేసి, ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. ఏప్రిల్ 2వ తేదీ గురువారం సాయంత్రం, మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ 35 ఏళ్ల మహిళ తన నివాసంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఒక వ్యక్తి 'దాహంగా ఉంది.. మంచినీళ్లు కావాలి' అని ఆమెను నమ్మించి లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా తాను అనారోగ్యంతో (హెచ్ఐవీ) ఉన్నానని మొరపెట్టుకున్నా ఆ కిరాతకుడు కనికరించలేదు. బాధితురాలిని స్కార్ఫ్‌తో కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమెను తీవ్రంగా కొట్టి, మర్మాంగాల్లోకి ఇనుప రాడ్‌ను చొప్పించి అత్యంత క్రూరంగా ప్రవర్తించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలితో కలిసి నివసిస్తున్న ఆమె మేనల్లుడు పదో తరగతి పరీక్షల అనంతరం తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. సాయంత్రం అత్తకు ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను పంపాడు. వారు వెళ్లి చూడగా, ఆమె రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి హతాశులయ్యారు. వెంటనే ఆమెను మాచర్ల నుంచి నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మాచర్ల టౌన్ సీఐ వెంకట రమణ నేతృత్వంలో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
0 Comments