Ad Code

ఇండోనేషియాలో భారీ భూకంపం : రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4గా నమోదు : ఒకరు మృతి


ఇండోనేషియాలోని ఉత్తర మాలుకు ప్రావిన్స్ లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్ర గర్భంలో భూకంపం రావడంతో అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కొద్ది గంటల తర్వాత వాటిని ఉపసంహరించుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అప్రమత్తమైంది. భూకంప కేంద్రం నుండి 1,000 కిలోమీటర్ల పరిధిలోని ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఉత్తర మినాహాసా ప్రాంతంలో 75 సెంటీమీటర్ల ఎత్తులో చిన్నపాటి అలలు ఎగిసిపడ్డాయి. దాదాపు రెండు గంటల పరిశీలన తర్వాత, సముద్ర మట్టంలో పెద్దగా మార్పులు లేకపోవడంతో సునామీ ముప్పు తొలిగిపోయిందని అధికారులు ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6:48 గంటలకు మొలుక్కా సముద్రంలో టెర్నాటే నగరానికి వాయువ్యంగా సుమారు 120 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. సముద్ర మట్టానికి 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం సంభవించిన సమయంలో సుమారు ఒక నిమిషం పాటు భూమి బలంగా కంపించడంతో ఉత్తర సులవేసి, ఉత్తర మాలుకు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నార్త్ సులవేసి ప్రావిన్స్ లోని మనాడో నగరంలో ఒక భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకొని ఒకరు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. మనాడో, టెర్నాటే ప్రాంతాల్లో పలు ఇళ్లు, పాఠశాలలు, చర్చిల గోడలు బీటలు వారినట్లు స్థానిక మీడియా ప్రతినిధులు తెలిపారు. భూకంపం దాటికి ఇళ్లలోని సామాన్లు కింద పడిపోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Post a Comment

0 Comments

Close Menu