మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరుగుతున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో వందలాది మంది అభ్యర్థులు ఖరీదైన షూస్ వేసుకుని మైదానంలో పరుగులు తీస్తుంటే, ఒక యువకుడు మాత్రం కేవలం సాదాసీదా చెప్పులతో ఐదు కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెప్పులతో పరుగెత్తడం వల్ల కాళ్లు రాపిడికి గురై బొబ్బలు వచ్చినా కళ్ల ముందు తల్లిదండ్రుల పేదరికం, ఒంటిపై ఖాకీ వర్దిని చూడాలనే స్వప్నం అతడిని ముందుకు నడిపించాయి. పట్టుదలతో ఆ పరుగును విజయవంతంగా ముగించాడు. పోలీస్ నియామక ప్రక్రియను పర్యవేక్షించడానికి వచ్చిన డీసీపీ విక్రమ్ సాలి కన్ను ఆ యువకుడిపై పడింది. దగ్గరకు పిలిచి, "చెప్పులతో ఎందుకు పరుగెత్తావు ?" అని ప్రేమగా అడిగారు. దానికి ఆ యువకుడు.. "సార్, షూస్ కొనేందుకు నా దగ్గర డబ్బులు లేవు. మా ఇంటి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కానీ పోలీస్ కావాలనే నా కలను మాత్రం వదులుకోలేను" అని చెప్పాడు. ఆ మాట విన్న డీసీపీ ఒక్కసారిగా చలించిపోయారు. అక్కడ ఉన్న వారందరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఆ కుర్రాడి పరిస్థితిని చూసి చలించిపోయిన డీసీపీ విక్రమ్ సాలి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన జేబులోంచి డబ్బులు తీసి, సిబ్బందిని పంపించి కొత్త షూస్ తెప్పించారు. స్వయంగా తన చేతులతో ఆ యువకుడికి కొత్త షూస్ అందించారు. వీడియో తీస్తుంటే "వద్దు, మనం చేసే ఈ చిన్న సహాయానికి ప్రచారం అక్కర్లేదు" అని సున్నితంగా వారించారు. కొత్త షూస్ చేతిలోకి రాగానే ఆ యువకుడి కళ్లలో ఆనందబాష్పాలు చిందాయి. డీసీపీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. "సార్, ఈ షూస్ నాకు మా సార్ గిఫ్ట్ ఇచ్చారని మా ఇంట్లో చెబుతాను" అంటూ మురిసిపోయాడు. ఆ చిన్న సహాయం ఆ యువకుడిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే డీసీపీ విక్రమ్ సాలిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
0 Comments