కర్ణాటకలో కేరళకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరణ్య మిస్సింగ్ ఉదంతం మరువక ముందే, ఇప్పుడు 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని చంద్రద్రోణ పర్వత శ్రేణుల్లో అదృశ్యం కావడం సంచలనంగా మారింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన శ్రీ నంద (14) అనే పదో తరగతి విద్యార్థిని, తన బంధువులతో కలిసి ఏప్రిల్ 7న కర్ణాటకలోని ప్రసిద్ధ చంద్రద్రోణ కొండలకు ట్రెకింగ్‌కు వెళ్లింది. దాదాపు 40 మంది బంధువులతో కలిసి విహరిస్తుండగా, సాయంత్రం 5:30 గంటల సమయంలో చీకటి పడటంతో ఆ బాలిక ఒక్కసారిగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోవడంతో ఏప్రిల్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం కర్ణాటక పోలీసులు యుద్ధప్రాతిపదికన సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దట్టమైన అడవి, లోతైన లోయలు ఉండటంతో రాత్రిపూట కూడా డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన మలుపులు, కొండచరియల వద్దకు తాళ్ల సాయంతో దిగి పోలీసులు గాలిస్తున్నారు. కేరళ పోలీసుల బృందం కూడా ఈ దర్యాప్తులో పాల్గొంటోంది. ఇదే వారంలో కేరళకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ జి.ఎస్. శరణ్య (36) కూడా కొడగు జిల్లాలోని తడియాండమోల్ శిఖరంపై ట్రెకింగ్‌కు వెళ్లి నాలుగు రోజుల పాటు అదృశ్యమయ్యారు. ఆహారం లేకుండా కేవలం నీటితోనే నాలుగు రోజులు అడవిలో గడిపి ప్రాణాలతో బయటపడ్డారు.
0 Comments