Ad Code

గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ను సమర్ధవంతంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు : ఉన్నతాధికారులు, యావత్ సిబ్బందికి భట్టి అభినందనలు


తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11.01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ను ఎలాంటి అవాంతరాలు లేకుండా సమర్ధవంతంగా నిర్వహించాయి. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర విద్యుత్ సంస్థ చరిత్రలోనే గరిష్ట డిమాండ్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేసి నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన ఉన్నతాధికారులు, యావత్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనం అని పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను సమానంగా లేదా అధిగమించే స్థాయికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోందన్నారు. 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్రం సుమారు 19,900 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను నమోదు చేసిన మధ్యప్రదేశ్, అలాగే 19,600-20,600 మెగావాట్ల మధ్య గరిష్ట డిమాండ్ నమోదైన రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలకు సమానంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. భూభాగం, జనాభా పరంగా చిన్నదైనా తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటిందన్నారు. పంజాబ్, హర్యానా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ఠ డిమాండ్‌ను రాష్ట్రం నమోదు చేసిందన్నారు. భౌగోళికంగా చిన్నదైనా అధిక విద్యుత్ వినియోగ సాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని, ఐటీ, ఔషధ తయారీ, తయారీ రంగం, సాగునీటి విస్తరణ వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి దీనికి ప్రధాన కారణమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu