Ad Code

సర్పంచ్ కుటుంబంపై సజీవ దహన యత్నం : పెట్రోల్‌తో దాడి చేసిన నిందితుడు


తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రూప్‌సింగ్ తాండాలో ఆస్తి తగాదాలు, డబ్బుపై వ్యామోహం కన్న తండ్రిని, కుటుంబ సభ్యులను సజీవ దహనం చేసే స్థాయికి తీసుకెళ్లాయి. స్థానిక సర్పంచ్ రమణి భాయ్ కుటుంబంపై జరిగిన ఈ హత్యాయత్నం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సర్పంచ్ రమణి భాయ్ కుటుంబం ఈరోజు తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘాతుకం జరిగింది. నిందితుడు అనార్ సింగ్ కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు రాకుండా ఇంటి ప్రధాన తలుపుకు బయట నుంచి తాళం వేసి ఇంటి పైకప్పుకున్న రంధ్రం ద్వారా లోపలికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న సర్పంచ్ రమణి భాయ్, ఆమె భర్త హన్మంత్ నాయక్, కుమారుడు వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారు. మరో కుమారుడు శివకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ దారుణానికి ప్రధాన కారణం కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హన్మంత్ నాయక్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాతిభాయ్ ఇటీవల మరణించారు. సర్పంచ్ రమణి భాయ్ రెండవ భార్య. మరణించిన నాతిభాయ్ పేరిట రూ.5 లక్షల రైతుబీమా మంజూరైంది. ఈ డబ్బుతో పాటు ఆస్తిలో వాటా కావాలని నాతిభాయ్ కుమారుడైన అనార్ సింగ్ తండ్రితో తరచూ గొడవ పడేవాడు. తండ్రి హన్మంత్ నాయక్ తన డిమాండ్లను పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకున్న అనార్ సింగ్, అడ్డుగా ఉన్న మొత్తం కుటుంబాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. మంటలు చెలరేగడం గమనించిన తాండా వాసులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుల నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని సేకరించారు.

Post a Comment

0 Comments

Close Menu