Ad Code

కేంద్ర మాజీ మంత్రి బిరేన్ సింగ్ ఎంగ్టి కన్నుమూత

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి బిరేన్ సింగ్ ఎంగ్టి కన్నుమూశారు. దిఫులోని ఆయన నివాసంలో ఇటీవల బిరేన్ సింగ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు గుహవటి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బిరేన్ సింగ్ కన్నుమూశారు. బిరేన్ సింగ్‌కు దాదాపు ఐదు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది. ఆయన అసోంలని, కర్బి ఆంగ్లాంగ్ జిల్లా, దిఫు పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 1971, 1977, 1984లో ఎంపీగా గెలవగా, ఆ తర్వాత 2004 నుంచి వరుసగా మూడుసార్లు.. అంటే 2004, 2009, 2014లో ఎంపీగా గెలిచారు. రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. కర్బి ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గానూ సేవలందించారు. బిరేన్ సింగ్ మృతిపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. దీర్ఘకాలికంగా బిరేన్ సింగ్ దిఫు ప్రాంతంలో అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కాంగ్రెస్ అగ్రనేతలు కూడా బిరేన్ సింగ్ మృతిపై సంతాపం తెలిపారు. ఆయన మరణం అసోం రాజకీయాలకు, ఈ ప్రాంతానికి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గౌరవ్ గొగోయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన చిన్నతనం అంతా బిరేన్ సింగ్ కుటుంబంతోనే గడిచిందని గుర్తు చేసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu