Ad Code

బహ్రెయిన్‌లోని బాప్కో ఎనర్జీస్ పై ఇరాన్ దాడి


గల్ఫ్‌ దేశాల్ని లక్ష్యంగా చేసుకుని  ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా బహ్రెయిన్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాప్కో ఎనర్జీస్ పై ఇరాన్ దాడి చేసింది. దీంతో ఈ చమురు శుద్ధి సంస్థకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు కూడా సౌదీలోని సౌదీ అరాంకో సంస్థపై ఇరాన్ దాడి చేసింది. తమ దేశంలోని ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు దిగుతుండటంతో గల్ఫ్‌ దేశాల్లో ఆందోళన మొదలైంది.  చమురు సంస్థల్ని దెబ్బతీసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని చమురు నిల్వ కేంద్రాలు, శుద్ధి కేంద్రాలు, పైప్ లైన్లు, ఇతర ప్లాంట్లపై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. అయితే, ఈ దాడుల ఉద్దేశం అమెరికా తమపై దాడులు చేయకుండా అడ్డుకునేలా గల్ఫ్ దేశాలపై ఒత్తిడి తేవడమే అని విశ్లేషకుల అంచనా. ఇక్కడి అమెరికా సైనిక కేంద్రాల నుంచి తమపై దాడికి పాల్పడకుండా చూడాలని గల్ఫ్ దేశాల్ని ఇరాన్ కోరుతోంది. మరోవైపు రెండు రోజుల క్రితం ఇరాన్‌లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో చమురు నిల్వ కేంద్రాలు, రిఫైనరీలకు భారీ నష్టం కలిగింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇంతకుముందు 100 డాలర్లలోపే ఉన్న బ్యారెల్ క్రూడాయిల్ ధర ఇప్పుడు 110 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ చేసిన ఈ పనిపై అమెరికా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu