Ad Code

మహిళ భద్రత కోసం స్మార్ట్ జాకెట్ !


ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌కి చెందిన విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించి మహిళల భద్రత కోసం స్మార్ట్ జాకెట్ తయారు చేశారు. నేటి కాలంలో దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు స్మార్ట్ సొల్యూషన్‌తో ముందుకు వచ్చారు. దుండగులు మహిళలను బలవంతం చేసినప్పుడు, వారిని టచ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తే తగిన గుణపాఠం చెప్పేలా స్మార్ట్ జాకెట్‌ను రెడీ చేశారు. స్మార్ట్ జాకెట్ వేసుకున్న మహిళలపై ఎవరైనా చేయి వేయడానికి ప్రయత్నిస్తే వెంటనే కరెంటు షాక్ తగులుతుంది. ఇక అవతలి వ్యక్తి బలవంతంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అదే స్థాయిలో కరెంట్ షాక్‌కు గురౌతాడు. ఒక స్త్రీపై ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే లైవ్ రికార్డింగ్ కోసం ఈ స్మార్ట్‌ జాకెట్‌లో చిన్న చిన్న కెమెరాలను కూడా అమర్చారు. దీంతో నిందితుడిని గుర్తించడం కూడా చాలా సులభతరమవుతుంది. ఈ స్మార్ట్ జాకెట్‌ను తయారు చేసేందుకు విద్యార్థులు వైర్లు, సెన్సార్లు, ట్రాన్స్‌మిటర్లు, కెమెరాలు, బ్యాటరీలు, బ్లూటూత్ మైక్రోఫోన్లు, మెటల్ షీట్‌లను వాడటం జరిగింది. ఇది ఉపయోగించే మహిళల భద్రత కోసం, రెండు కెమెరాలు కూడా పెట్టారు. జాకెట్ ముందు వైపు ఒకటి ఇంకా అలాగే వెనుక వైపు మరో కెమెరా అమర్చారు. దుండగులు ఎటువైపు నుంచి వచ్చినా సరే వారిని ఈజీగా గుర్తించేందుకు వీలుగా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ జాకెట్ 200 నుండి 4000 వోల్ట్ ల వరకు కరెంట్ షాక్‌లను ఉత్పత్తి చేస్తుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ వినిత్‌రాయ్ తెలిపారు. అర్థరాత్రి సమయాల్లో తమ పనిని ముగించుకుని ఇళ్లకు వెళ్లే మహిళల సేఫ్టీనే ప్రధాన ఉద్దేశంగా ఈ జాకెట్లను తయారు చేశామని వీటి రూపకల్పనలో భాగస్వాములైన స్టూడెంట్స్ తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu